Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంకేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలు

కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలు

కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలు

సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి పిలుపు

 

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, జూలై 30 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా “ఢిల్లీ నుంచి గల్లీ వరకు” పాదయాత్రలు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రహిమాన్ తెలిపారు. గురువారం అల్లిపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన గోడపత్రికను విడుదల చేసి మాట్లాడారు.

2014లో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో ప్రజల సమస్యలను విస్మరించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్రలు, సభలు, కరపత్రాల పంపిణీ ద్వారా విస్తృత ప్రచారం చేపడతామని చెప్పారు.

సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని సమీకరించనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, విద్యా–వైద్య రంగాల నిర్లక్ష్యం, కార్మికులకు కనీస వేతనాల లేమి, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు పెరగడం, మహిళల భద్రత లోపించడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు దూరం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 16 నుంచి 27 వరకు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ శతాబ్ద కాలంగా పోరాటం చేస్తోందని, ప్రజలంతా ఎర్రజెండా పోరాటాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. పైడ్రాజు, ఎం. మన్మధరావు, ఎన్. నాగభూషణం, కే. వనజాక్షి, ఎం.ఏ. బేగం, జి. రాంబాబు, నాయకులు సిహెచ్. కాసుబాబు, తెడ్డు వెంకటేశ్వరరావు, సీపీఐ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular