భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో ‘నో ఫ్లయింగ్ జోన్’ అమలు
ఆగస్టు 1 వరకు డ్రోన్లు, యూఏవీలు, పారాగ్లైడర్ల ఎగురవేతపై నిషేధం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ పెన్ పవర్ భోగపురం /విజయనగరం, జూలై 30:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని **’నో ఫ్లయింగ్ జోన్’**గా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.
జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భోగాపురం బహిరంగ సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రధానమంత్రి ప్రయాణ మార్గం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో BNSS-2023 సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. జూలై 29 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు మొత్తం 72 గంటల పాటు అన్ని రకాల డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), పారాగ్లైడర్లు, మైక్రోలైట్ విమానాలు తదితర వైమానిక వస్తువుల ఎగురవేతను పూర్తిగా నిషేధించారు.
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా, శాంతిభద్రతలు, ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

