Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంకనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి సీఐటీయూ చలో కలెక్టరేట్..

కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి సీఐటీయూ చలో కలెక్టరేట్..

✒️

 

కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి

సీఐటీయూ చలో కలెక్టరేట్..

వేతనాలు పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 30: షెడ్యూల్డ్ పరిశ్రమలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం విశాఖపట్నంలో భారీ “చలో కలెక్టరేట్” కార్యక్రమం నిర్వహించారు. సరస్వతి పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.

ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగ్‌రావు మాట్లాడుతూ, చిన్న పరిశ్రమలు, షాపులు, షాపింగ్ మాల్స్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు తదితర షెడ్యూల్డ్ పరిశ్రమల్లో గత 20 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ జరగకపోవడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. ప్రస్తుతం కార్మికులు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే వేతనాలు పొందుతున్నారని, పెరిగిన నిత్యావసర ధరలకు ఈ వేతనాలు ఏమాత్రం సరిపోవని అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కనీస వేతనాలు పెంచినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించిందని ఆరోపించారు.

కనీస వేతనం రూ.26,000 అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కార్మికులకు తగిన వేతనాలు చెల్లించాలని, సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను హైకోర్టు తీర్పు మేరకు శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని కోరారు. జీవీఎంసీ, ప్రభుత్వ ఆస్పత్రులు, ఎస్‌ఎస్‌ఏ, తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

విశాఖ డెయిరీలో తొలగించిన 300 మంది కాంట్రాక్ట్ కార్మికులను, స్టీల్ ప్లాంట్‌లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సినర్జీ పరిశ్రమను పునఃప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆధార్ కార్డు స్తంభనను రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎం శ్రీనివాస్, ఆర్‌కేఎస్‌వీ కుమార్‌తో పాటు జిల్లా నాయకులు ఎం. జగ్గు నాయుడు, బి. జగన్, పి. మణి, ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, పి. వెంకట్రావు, ఎం. సుబ్బారావు, ఒమ్మి అప్పారావు, ఉరుకూటి రాజు, నూకరాజు, అనసూయ, రాంబాబు, బంగారు నాయుడు, నమ్మి రమణ, సోమేష్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, ఎనిమిది గంటల పనిదినం అమలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల కల్పన వంటి డిమాండ్లతో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular