బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 4 : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాలను భావితరాలకు చాటిచెప్పేలా పాండ్రంగిలో విప్లవ వీరుల పార్కు ఏర్పాటు కోసం కృషి చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి శనివారం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టడం ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అల్లూరి జన్మస్థలమైన పాండ్రంగి చెరువు చుట్టూ అల్లూరితో పాటు 25 మంది స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలతో విప్లవ వీరుల పార్కు ఏర్పాటు చేయాలన్న సంకల్పం నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులు చేపట్టి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే ప్రతి ఏడాది భారతమాతకు పరస నిర్వహించి కలశాభిషేకం చేసేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ అల్లూరి నడయాడిన ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యం స్థానికులకు కూడా పూర్తిగా తెలియకపోవడం విచారకరమని అన్నారు. ఆ చరిత్రను ప్రజలకు చేరవేసేందుకే అల్లూరి స్పూర్తి యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్లులో నిర్మించిన తరహాలోనే పాండ్రంగిలో కూడా 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనంతరం స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఆర్డీఓ కె. సంగీత్ మాధుర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి మాధవి, ఏసీపీ అప్పలరాజు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, పరశురామరాజు, కురుమిన రామస్వామి నాయుడు, జి. కైలాసరెడ్డి, తాట్రాజు అప్పారావు, కె. రామరాజు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

