జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎవరినీ ఉపేక్షించం: కలెక్టర్ నిషాంతి. టి
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జూలై 6: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంతి.టి హెచ్చరించారు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియలో విధులకు గైర్హాజరైన ఒక పంచాయతీ కార్యదర్శి, బూత్ లెవెల్ అధికారి (BLO)గా విధులు నిర్వహిస్తూ బాధ్యతలను విస్మరించిన ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ చర్యలు చేపట్టినట్లు సోమవారం కలెక్టరేట్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగాల్సిన బాధ్యత ప్రతి అధికారి, ఉద్యోగిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విధుల్లో ఎలాంటి అలసత్వాన్నీ సహించబోమని, ఎన్నికల సంఘం నిర్దేశించిన బాధ్యతలను విస్మరించినా, విధులకు గైర్హాజరైనా చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి అధికారి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, బూత్ స్థాయి బాధ్యతలను నిరంతరం పర్యవేక్షిస్తూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ నిషాంతి. టి స్పష్టం చేశారు.

