స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: వాసుపల్లి గణేష్ కుమార్
గిరి ప్రదక్షిణ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 :
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆశీలమెట్టలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా విశాఖ మీదుగా రానున్న నేపథ్యంలో భారీ జనసమీకరణతో స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సమగ్ర సర్వే (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్ఓలకు కృతజ్ఞతలు తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియతో పాటు ఓటీపీ వెరిఫికేషన్‌ను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
వార్డుల విస్తరణతో ఈసారి మరింత మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందని, పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వాసుపల్లి గణేష్ కుమార్, సింహాచలం గిరి ప్రదక్షిణ నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించి, వాహనదారులు, భక్తులు గంటల తరబడి ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

