గార్ల ,పెన్ పవర్, ఆగస్టు 7:
నిషేధిత కలుపు మందు పారాక్వాట్ నిల్వ ఉంచినా, రైతులకు విక్రయించినా సంబంధిత పురుగు మందుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే షాపుల లైసెన్సులను సైతం రద్దు చేస్తామని మహబూబాబాద్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) అజ్మీరా శ్రీనివాస్ రావు హెచ్చరించారు.శుక్రవారం గార్ల మండలంలోని పుల్లూరు గార్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రామారావుతో కలిసి పురుగు మందులు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో నిషేధిత పారాక్వాట్ కలుపు మందు నిల్వలు ఉన్నాయా, రైతులకు విక్రయిస్తున్నారా అని రికార్డులను పరిశీలించారు. పారాక్వాట్ అత్యంత విషపూరితమైన కలుపు మందు అని, దీని వినియోగం పంటలకు, భూసారానికి, పర్యావరణానికి హానికరమని తెలిపారు. ఈ కారణంగానే ప్రభుత్వం దీని విక్రయాన్ని నిషేధించిందని చెప్పారు. అయినప్పటికీ ఎవరైనా రైతులకు ఈ మందును విక్రయిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.వ్యాపారులు ఎరువులు, పురుగు మందుల విక్రయాలను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని దుకాణాల యజమానులకు సూచించారు. ప్రతి దుకాణంలో స్టాక్ రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు, ధరల పట్టికను వినియోగదారులకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు.తనిఖీల అనంతరం పుల్లూరులోని పత్తి పంట పొలాలను సందర్శించిన ఏడీఏ అజ్మీరా శ్రీనివాస్ రావు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు, ముఖ్యంగా యూరియా, కాంప్లెక్స్ ఎరువులను పరిమితంగా ఉపయోగించాలని, వాటికి ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులను అధికంగా వినియోగించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూసారం మెరుగుపడటంతో పాటు పంటల దిగుబడులు కూడా మెరుగ్గా ఉంటాయని వివరించారు.పంటల సాగులో సమీకృత యాజమాన్య పద్ధతులను పాటించాలని, ప్రత్తి లో తొలి దశలో ఆశించే రసం పిల్చే పురుగులైన పేను బంక పచ్చ దోమ నివారణకు అసెటామాప్రిడ్ లేదా తియోమితక్సమ్ వంటి మందులను 13.0.45 తో కానీ 19.19.19 తో కానీ కలిపి వాడాలన్నారుఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి శాస్త్రీయ సలహాలతో సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది, ఎరువు పురుగు మందుల దుకాణాల యజమానులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

