*ఏళ్లు గడుస్తున్నా ఒక్క బస్సూ కేటాయించని వైనం*
*ఖమ్మం డిపో బస్సులే దిక్కు*
*వినతులు ఇచ్చినా హామీలకే పరిమితం* *బస్సుల కోసం మండల ప్రజల నిరీక్షణ*
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 6:
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాలో చేరిన గార్ల మండలానికి ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు కొత్త జిల్లా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి గార్ల మండలానికి ఒక్క సాధారణ బస్సు కూడా కేటాయించకపోవడంపై మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
*ఖమ్మం బస్సులే ఆధారం..*
ప్రస్తుతం గార్ల మీదుగా ఖమ్మం–మహబూబాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ఖమ్మం డిపోకు చెందిన బస్సులే ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్నాయి. గార్ల ప్రాంతం నుంచి ఆర్టీసీకి గణనీయమైన టికెట్ ఆదాయం లభిస్తున్నప్పటికీ, మహబూబాబాద్ డిపో నుంచి బస్సులు నడపకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా పరిధిలో ఉన్న మండలానికి అదే జిల్లా డిపో నుంచి కనీస రవాణా సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.
*హామీలకు కొదవలేదు అమలుకు దిక్కులేదు*
గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పలుమార్లు మహబూబాబాద్ డిపో అధికారులను కలిసి గార్ల మండలానికి బస్సులు కేటాయించాలని వినతిపత్రాలు అందజేశారు. అయితే ప్రతిసారీ ‘త్వరలో బస్సులు ఏర్పాటు చేస్తాం’ అనే హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో మాత్రం చర్యలు కనిపించడం లేదని మండలవాసులు అంటున్నారు.
*అడ్డంకులు తొలగినా.. బస్సులు రావా?*
గతంలో గుంతలతో ఉన్న రహదారుల కారణంగా బస్సుల రాకపోకలకు కొంత ఇబ్బంది ఉండేది. ప్రస్తుతం ఆ సమస్యలు తొలగిపోవడంతో పాటు రహదారి సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ డిపో నుంచి గార్లకు సాధారణ, సర్వీసులతో పాటు ప్రయాణికుల అవసరాలను బట్టి మహబూబాబాద్ నుంచి గార్ల మీదుగా ఖమ్మం కు నేరుగా ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులను ఏర్పాటు చేసేందుకు అవకాశముందని స్థానికులు పేర్కొంటున్నారు.
*ఏజెన్సీ ప్రజల ప్రయాణ కష్టాలు పట్టవా?*
షెడ్యూల్డ్ ఏరియా (ఏజెన్సీ) పరిధిలో ఉన్న గార్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం నిత్యం వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహబూబాబాద్ డిపో నుంచి తగిన సంఖ్యలో బస్సులను కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
*ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి* *సోషల్ వర్కర్ ఈశ్వర్ లింగం*
గార్ల మండలం మహబూబాబాద్ జిల్లాలో భాగమైనప్పుడు.. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో సేవలు మండల ప్రజలకు ఎందుకు అందడం లేదని మండల ప్రజల తరఫున పలుమార్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఆశించిన స్పందన రావడంలేదని గార్ల మండలానికి అవసరమైన ఆర్టీసీ సర్వీసులను తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందని ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే మహబూబాబాద్ డిపో నుండి బస్సు సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

