గార్ల, పెన్ పవర్, ఆగస్టు 18:
యూఎస్ఎఫ్ఐ, గార్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాళోత్ శాంతికుమార్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో తనదైన ముద్ర వేసిన మహోన్నత నాయకుడని అన్నారు. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఆయన ప్రదర్శించిన ధైర్యం, పట్టుదల, త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. దేశం కోసం నేతాజీ చేసిన పోరాటం నేటి యువత, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమనివిద్యార్థులు నేతాజీ జీవిత చరిత్రను, ఆయన పోరాట స్ఫూర్తిని అధ్యయనం చేయాలని సూచించారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన నేతాజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్యాయం, అసమానతలు చోటుచేసుకున్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే ధైర్యాన్ని అలవర్చుకోవాలన్నారు.విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి యూఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. నేతాజీ దేశభక్తి, క్రమశిక్షణ, ధైర్యం, త్యాగం వంటి విలువలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పవన్, అశోక్, గార్ల మండల నాయకులు తిరుమలేష్, నాగేష్, కళ్యాణ్, వీరన్న, రమేష్, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

