హైదరాబాద్, పెన్ పవర్, ఆగస్టు 18:
బడుగులకు రాజ్యాధికార దిశగా పోరు విత్తనం నాటిన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పోచంపల్లి గౌడ సంఘం అధ్యక్షులు గుణిగంటి మల్లేష్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని పోచంపల్లి గౌడ సంఘం కార్యాలయంలో మంగళవారం పాపన్న గౌడ్ చిత్రపటానికి గౌడ కులస్తులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామన్య కుటుంబం నుంచి ఎదిగిన సర్వాయి పాపన్న ప్రజలను ఏకం చేసి అప్పటి ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. ప్రజల హక్కులు, గౌరవం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న పోరాటం కేవలం అధికార సాధనకే పరిమితం కాకుండా సామాజిక అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగి ప్రజల కోసం పోరాడవచ్చని తన జీవితంతో నిరూపించారని అన్నారు. పాపన్న చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, ఐక్యతా స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌడ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మాజీ అధ్యక్షులు కొయ్యడ యాదయ్య గౌడ్, గౌడ కుల నాయకులు చెరుకు బిక్షపతి గౌడ్, చెరుకు అంజయ్య గౌడ్, బండి యాదగిరి గౌడ్, తండ వెంకటేష్ గౌడ్, మక్తాల పోషయ్య గౌడ్, సార బాలయ్య, తంతరపల్లి వెంకటేష్, ముప్పిడి శ్రీనివాస్, చెరుకు మల్లయ్య, కట్కూరి పాండు, వేముల సుమన్ గౌడ్, కండె విజయ్ గౌడ్, కులస్తులు పాల్గొన్నారు.

