Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంఎన్నికల్లో డబ్బులు పంచలేదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా?

ఎన్నికల్లో డబ్బులు పంచలేదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా?

✒️

మహిళలకు వంచన, దగా రెట్టింపు చేశారు

ఎన్నికల్లో డబ్బులు పంచలేదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా?

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు.

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 16: మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. విశాఖలోని వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

మహిళల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేయలేదని, దగా, వంచనను మాత్రమే రెట్టింపు చేశారని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డ్వాక్రా, ఉచిత బస్సు మహిళలతో చంద్రబాబు నిర్వహించిన తేనీటి విందు మహిళల సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమం కాదని, కేవలం ప్రచార కార్యక్రమంగా అభివర్ణించారు.

ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన రూ.18 వేల ఆర్థిక సాయం, ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు, నిరుద్యోగ భృతి, మూడు సెంట్ల స్థలం, ఇళ్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీల పరిస్థితిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ.1.80 లక్షల కోట్ల బకాయి: కళ్యాణి

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయి పడిందని వరుదు కళ్యాణి పేర్కొన్నారు. 25 నెలల కాలానికి మహిళలకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.1.80 లక్షల కోట్లుగా ఆమె ఆరోపించారు. ఇంత మొత్తాన్ని చెల్లించకుండా రూ.3 వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఆ మొత్తం ఏ ఖాతాల్లో జమ చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

‘ఓటుకు నోటు’పై ప్రశ్న

మహిళలు డబ్బులు తీసుకుని ఓట్లు వేశారని, వారికి ప్రశ్నించే నైతిక హక్కు లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలను లంచగొండులుగా చిత్రీకరించడం సరికాదన్నారు.

ఉచిత బస్సుపైనా విమర్శలు

ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి షరతులు లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని బస్సులకే పరిమితం చేశారని కళ్యాణి ఆరోపించారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. ఉచిత బస్సు పేరుతో ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

సున్నా వడ్డీ, ‘సూపర్ సిక్స్’ హామీలపై నిలదీత

గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కోసం నిధులు కేటాయించామని పేర్కొన్న కళ్యాణి, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సున్నా వడ్డీ హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్, మూడు సెంట్ల స్థలం వంటి హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

మహిళల భద్రతపై ఆందోళన

మహిళల భద్రత కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టాన్ని రద్దు చేశారని ఆరోపించిన ఆమె, రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ సమస్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయగలరా?

ఎన్నికల్లో తాను ఒక్క రూపాయి కూడా పంచలేదని తిరుమల శ్రీవారి సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేయగలరా అని వరుదు కళ్యాణి సవాల్ చేశారు. మహిళలు అమాయకులు కాదని, పదేపదే మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర మహిళలు ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular