విశాఖకు త్వరలో వస్తా: సద్గురు
గంటా శ్రీనివాసరావుతో ఢిల్లీ విమానాశ్రయంలో సద్గురు భేటీ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 12: విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని, త్వరలోనే విశాఖకు వస్తానని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సద్గురును కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ పలు అంశాలపై చర్చించారు.
2014-19 మధ్య గంటా శ్రీనివాసరావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈషా సంస్థలను నెలకొల్పే అంశంపై సద్గురుతో కలిసి విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో పర్యటించిన విషయాలను సద్గురు గుర్తు చేసుకున్నారు.
గతంలో ప్రతిపాదించిన విధంగా ఆదియోగి పేరుతో విశాఖలో ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పాలనే ఆసక్తి ఇప్పటికీ తనకు ఉందని సద్గురు వెల్లడించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు విశాఖకు రావాలని ఆయనను ఆహ్వానించారు. దీనికి సద్గురు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా విశాఖకు వస్తానని తెలిపారు.
విశాఖ ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్న సద్గురు, గతంలో జరిగిన విశాఖ ఉత్సవ్‌లో తన కుమార్తె నృత్య ప్రదర్శన ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. సద్గురుతో జరిగిన ఈ భేటీపై గంటా శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు.

