జీవీఎంసీ ఎన్నికల్లో సామాన్యులకే కాంగ్రెస్ టిక్కెట్లు
ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడే వారికి తొలి ప్రాధాన్యం: ప్రియాంక దండి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 11: జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులుగా సామాన్యులకు, యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు.
సామాన్యులు, యువత, మహిళలు తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని సమాజంలో మార్పు తీసుకురాగల సామర్థ్యం వారిలో ఉందని ఆమె అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న వారికి ఎన్నికల్లో అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని ప్రియాంక దండి పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్న నాయకులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ప్రశ్నించే వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ, అధికార పార్టీ నాయకులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు మెరుగైన నాయకత్వాన్ని అందించగల అభ్యర్థులను జీవీఎంసీ ఎన్నికల్లో ఎంపిక చేస్తామని ప్రియాంక దండి తెలిపారు.

