వరల్డ్ రోజ్ డే సందర్భంగా ఉప్పుటూరులో అవగాహన కార్యక్రమం
ఉప్పుటూరు, సెప్టెంబర్ 22 (పెన్ పవర్):
వరల్డ్ రోజ్ డే సందర్భంగా మంగళవారం ఉప్పుటూరులో ప్రభుత్వ హోమియో వైద్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం, వ్యాధి పట్ల భయాన్ని వీడి మనోధైర్యంతో ఎదుర్కోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కెనడాకు చెందిన మెలిండా రోజ్ అనే 12 ఏళ్ల బాలిక క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో వైద్యులు ఆమె ఆరు వారాలకు మించి జీవించదని తెలిపినా, ఆమె మనోధైర్యంతో ఆరు నెలలు జీవించిందన్నారు. ఆ సమయంలో తన వ్యాధి గురించి బాధపడకుండా ఇతర క్యాన్సర్ బాధితులను ఉత్సాహపరుస్తూ అండగా నిలిచిన ఆమె స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 22న వరల్డ్ రోజ్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీవ్రమైన రక్తహీనత, ఆకలి మందగించడం, నీరసం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో వేగంగా పెరుగుతున్న నొప్పితో కూడిన కణితులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి చికిత్స పొందితే ప్రాణాపాయ పరిస్థితులను నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణకు ధూమపానం, మద్యపానం, మితిమీరిన ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. క్యాన్సర్ చికిత్సలో మందులతో పాటు బాధితులకు మనోధైర్యం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో అవసరమని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకురాలు కే. నాగరాజా, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

