చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) :
చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 28, 29వ వార్డుల్లో 15వ ఆర్థిక సంఘ నిధులతో రూ.17.05 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చీరాల పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణంతో ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. ప్రజలు అందిస్తున్న ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చీరాల పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

