Homeతెలంగాణరోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త

రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త

 

దుర్వాసనతో ప్రయాణికుల అవస్థలు

వ్యాధుల భయంతో స్థానికుల ఆందోళన

ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్ 4:

ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ జాతీయ రహదారిపై చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పక్కనే ఇళ్లలోని చెత్త, దుకాణాల వ్యర్థాలు, ఫంక్షన్లలో మిగిలిన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో పరిసర ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది.ప్రతిరోజూ వందలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో రోజురోజుకూ కుప్పలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెత్త కుప్పల కారణంగా ఈగలు, దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, పరిసరాల్లో నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని వారు చెబుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ అధికారులు స్పందించి రహదారి వెంట పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించడంతో పాటు, చెత్తను రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, నిరంతరం చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular