గొల్లగుప్ప ఘటనపై విచారణ జరిపించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస డిమాండ్,
గంగవరం/ రంపచోడవరం సెప్టెంబర్ 4 (పెన్ పవర్): పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రల పంపిణీ అనంతరం గిరిజన బాలిక మడివి జమున మృతి చెందడం, పలువురు గ్రామస్తులు అస్వస్థతకు గురైన ఘటనపై హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై NHRC డైరీ నెం. 20592/IN/2026గా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గ్రామాల్లో కొన్ని మలేరియా కేసులు నమోదైన అనంతరం ముందుజాగ్రత్త చర్యగా క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేయడం చాలా కాలంగా కొనసాగుతున్న పద్ధతిగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, వైద్య నిపుణుల బృందం పూర్తి స్థాయిలో పరిశీలించి సలహా ఇచ్చే వరకు ఈ విధానాన్ని నిలిపివేయాలని కోరారు.
వ్యక్తిగతంగా వైద్య పరీక్షలు నిర్వహించకుండా ప్రజలకు ముందస్తుగా క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయరాదని బాలు అక్కిస డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో క్లోరోక్విన్ మాత్రలను ముందుజాగ్రత్త చర్యగా వినియోగించే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులను ఆదేశించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరారు.
గొల్లగుప్పలో ఏం జరిగింది?
సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం గొల్లగుప్ప గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులో వివరించారు. గ్రామంలో 5 నుంచి 6 వరకు మలేరియా కేసులు నమోదైన నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) సిబ్బంది గ్రామంలోని 71 మంది స్థానికులకు క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు.
రుతుపవనాల అనంతరం మలేరియా కేసులు పెరిగే కాలంలో గిరిజన గ్రామాల్లో క్లోరోక్విన్ మాత్రలను సాధారణ నివారణ చర్యగా పంపిణీ చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. అయితే, వ్యక్తిగతంగా రోగ నిర్ధారణ చేయకుండా విస్తృత స్థాయిలో మాత్రలను పంపిణీ చేయడం వల్లే ఈ విషాదకర పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో ఆరోపించారు.
క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న కొద్ది గంటల్లోనే 47 మంది పిల్లలతో సహా మొత్తం 53 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వాంతులు, విరేచనాలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనలో 7 సంవత్సరాల గిరిజన బాలిక మడివి జమున స్పృహ కోల్పోయి మృతి చెందడం అత్యంత విషాదకరమని బాలు అక్కిస ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, గిరిజన ప్రాంతాల్లో భవిష్యత్తులో వైద్య నిపుణుల సూచనలు, వ్యక్తిగత ఆరోగ్య పరీక్షల అనంతరమే మందుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

