మహాకూటమిగా ఏర్పడి పోటీకి సిద్ధం కావాలని పిలుపు
బాపట్ల, సెప్టెంబర్ 20 (పెన్ పవర్):
బాపట్లలోని ఎన్జీ హోమ్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, ఏఐబీఎస్పీ ఆధ్వర్యంలో రాజకీయ అవగాహన సదస్సు నిర్వహించారు. నాయకులు కాటి మార్కు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సామాజిక వర్గాల రాజకీయ భాగస్వామ్యం, ప్రజా సంఘాల ఐక్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సదస్సులో బి. పరంజ్యోతి మాట్లాడుతూ ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు, కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుని మహాకూటమిగా ఏర్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
సామాజిక ఉద్యమకారులు మోహన్‌కుమార్, ధర్మ, ఊటుకూరు వెంకటేశ్వర్లు, చుండూరు వాసు, కాగిత కోటేశ్వరరావు, శీలం రవి, షేక్ బషీర్ మాట్లాడుతూ ప్రజా సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. సామాజిక వర్గాల హక్కులు, రాజకీయ భాగస్వామ్యంపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో భగత్ సింగ్, జగన్మోహన్ రావు, గొర్రెపాటి రవికుమార్, మురళి, సైమన్, కలాం, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

