Homeఆంధ్రప్రదేశ్పోలవరంస్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

 

గంగవరం మండలంలో పలు కేంద్రాలను సందర్శించిన పోలవరం జిల్లా ఎస్పీ కే.చక్రవర్తి

భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు మౌలిక సదుపాయాలపై ఆరా

గంగవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 28:
రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను ముందుగానే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని పోలవరం జిల్లా ఎస్పీ కే.చక్రవర్తి పోలీసు అధికారులను ఆదేశించారు. పోలవరం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గంగవరం మండలంలో సోమవారం పర్యటించిన ఆయన పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.తొలుత గంగవరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసుల పనితీరు తదితర అంశాలపై అడ్డతీగల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.గజేంద్ర కుమార్‌, గంగవరం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకయ్యతో సమీక్ష నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం గంగవరం మండలంలోని స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. అలాగే పెద్దఅడ్డపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలను పరిశీలించిన ఆయన ఎన్నికల సమయంలో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలు, ఓటర్ల రాకపోకలకు అనుకూలమైన పరిస్థితులు, తాగునీరు, విద్యుత్‌, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలపై ఎస్పీ ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ భద్రతను మరింత పటిష్టం చేయాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.ఈ పర్యటనలో అడ్డతీగల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.గజేంద్ర కుమార్‌, గంగవరం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్‌.సత్యవతి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular