ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌తో ముందస్తు బుకింగ్‌కు అవకాశం వ్యవసాయ సిబ్బంది, ఎరువుల డీలర్లకు శిక్షణ
రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 9:
రైతులకు అవసరమైన ఎరువులను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ డిజిటల్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పోలవరం జిల్లా వ్యవసాయాధికారి రామ్మోహన్ రావు తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులు తమ పంటలకు అవసరమైన ఎరువులను ముందుగానే నమోదు చేసుకొని, డిజిటల్ పద్ధతిలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సోమవారం రంపచోడవరంలోని కృషి విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, ఎరువుల విక్రయదారులకు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ వినియోగం, రైతుల నమోదు, ఎరువుల ముందస్తు బుకింగ్ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, రైతులు తమకు అవసరమైన ఎరువులను సులభంగా పొందేందుకు ఈ డిజిటల్ విధానం దోహదపడుతుందని వివరించారు.
ఆధార్‌తో భూములు, పంటల వివరాల నమోదు
రైతులు తమ సెల్ఫోన్లలోని ప్లే స్టోర్ నుంచి ఫార్మర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, ఆధార్ ఆధారంగా భూములు, సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసి అనుసంధానం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సాధారణ ఎరువుల సిఫార్సులకు అనుగుణంగా పంటలకు అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.
అనంతరం తమకు అవసరమైన ఎరువులను ఎంపిక చేసుకొని, యాప్‌లో క్యూఆర్ కోడ్ ఆధారంగా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ పూర్తయిన తర్వాత లభించే క్యూఆర్ కోడ్‌ను ఎంపిక చేసుకున్న అధీకృత ఎరువుల డీలర్‌కు చూపించి ఎరువులను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించి, డిజిటల్ సేవలను సమర్థంగా వినియోగించుకునేలా వ్యవసాయ సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
సిబ్బందికి సమగ్ర అవగాహన
శిక్షణ కార్యక్రమంలో వనరుల వ్యక్తులుగా ఈడీఏ కంకిపాటి సావిత్రి, మండల వ్యవసాయాధికారులు సీహెచ్ శ్రీనివాస్, అశోక్ పాల్గొని ఎఫ్ఎఫ్ఎస్ యాప్ వినియోగం, అమలు విధానం, రైతులకు అందించే సేవలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లాలోని 12 మండలాల వ్యవసాయాధికారులు, రంపచోడవరం, అడ్డతీగల వ్యవసాయ ఉపవిభాగాల సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయశాఖ సిబ్బంది, జిల్లాలోని ఎరువుల దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.

