తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది: మధుయాష్కి గౌడ్
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి సీఎంతో చర్చిస్తాం
కాంగ్రెస్ కార్యకర్తలపై కేసుల నివారణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక లీగల్ టీం
ఎల్బీనగర్ , పెన్ పవర్ అక్టోబర్ 24:
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. న్యాయవాదుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నాంపల్లిలోని ఇందిరాభవన్లో టీపీసీసీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అదనపు పీపీ నియామకాల్లో కట్ఆఫ్ మార్కుల సడలింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశాల కల్పన అంశాలను కాంగ్రెస్ న్యాయ విభాగం జాతీయ అధ్యక్షుడు అభిషేక్ మను సింఘ్వి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై నమోదవుతున్న కేసుల నివారణకు ఏఐపీసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక లీగల్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో కార్యకర్తలపై నమోదైన కేసుల వివరాలను సేకరించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటంలో న్యాయవాదులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

