డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలి
ఓఎస్డీ మంద జవ్వాలి ఆల్ఫా, ఐపీఎస్
రంపచోడవరం పోలవరం బ్యూరో), పెన్ పవర్, అక్టోబర్ 24:
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా తమ భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఓఎస్డీ (అడ్మిన్) మంద జవ్వాలి ఆల్ఫా, ఐపీఎస్ సూచించారు. విద్యే ప్రతి ఒక్కరి జీవితానికి పునాది అని, క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె పిలుపునిచ్చారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం రంపచోడవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంపచోడవరం జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీస్తుందని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని, వాటిని ప్రోత్సహించకూడదని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలు, చిన్నారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వారి హక్కులను కాపాడాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం 112 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం కావాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా ఎస్సై రమేష్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో నిర్వహించే రికార్డులు, పోలీసుల విధులు, లాకప్ నిర్వహణ, విధుల్లో ఉపయోగించే ఆయుధాలు, తూటాలు, పోలీస్ జాగిలాల సేవలు, వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును వివరించారు. పోలీస్ శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకు చట్టాలపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ అష్రఫ్ అలీ, సీఐ గోపి నరేంద్ర ప్రసాద్, ఎస్సై రమేష్, పోలీస్ కమ్యూనికేషన్ సిబ్బంది, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

