అడుగడుగునా పూలదండలు, మంగళ హారతులతో వార్డు ప్రజల ఘన స్వాగతం
రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలంటూ వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల అనిత అభ్యర్థన
ప్రచారంలో పాల్గొన్న పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతకాయల సన్యాసిపాత్రుడు
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిని చింతకాయల అనిత తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వార్డు ప్రజలు అడుగడుగునా పూలమాలలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం వైసిపి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు కణితి అన్నపూర్ణ, నీలం నాని, పెదిరెడ్ల పవన్, కర్రీ వినీల చైతన్య లతో కలిసి 31, 32, 33, 34 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతకాయల అనిత ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చింతకాయల అనిత మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉండే మనుషులమని, ఏ కష్టం వచ్చినా నేరుగా తమని కలిసే అవకాశం ఉందని, సీసీ కెమెరాలలో చూసి, నచ్చిన వారితో మాట్లాడే అలవాటు తమకు లేదని అన్నారు. పట్టణ సమస్యలపై తనకు అవగాహన ఉందని, తనను గెలిపిస్తే ప్రణాళికా బద్ధంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలను అష్ట కష్టాలు పెడుతున్నారని, శాంతియుత వాతావరణము కావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

