Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నం అభివృద్ధికి కూటమి అభ్యర్థులనే గెలిపించండి

నర్సీపట్నం అభివృద్ధికి కూటమి అభ్యర్థులనే గెలిపించండి

 – 19వ వార్డులో ముమ్మరంగా చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి ప్రచారం.

– 19వ వార్డు సుబ్బారాయుడు పాలెం లో రూ. 1.20 కోట్లతో 10 సీసీ రోడ్లు నిర్మించాం.

– అతి తక్కువ కాలంలోనే ‘స్వచ్ఛ నర్సీపట్నం’గా తీర్చిదిద్దుతామని భరోసా.

​నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి విస్తృత ప్రచారం. ఆమె ప్రచారానికి వెళ్లిన ప్రతి వార్డులోనూ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చి హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. బుధవారం 19వ వార్డు పరిధిలోని సుబ్బారాయుడుపాలెంలో ఆ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మితో కలిసి పద్మావతి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక రామాలయం, ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన  అనంతరం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గడపగడపకూ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మావతి మాట్లాడుతూ ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని, ఓటు వేసే ముందు సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. రాబోయే ఐదేళ్ల పాటు వార్డులో రోడ్లు, కాలువలు, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత కౌన్సిలర్లదేనని ఆమె స్పష్టం చేశారు. స్థానిక అభివృద్ధికి మున్సిపల్ నిధులతో పాటు, భారీ నిధులు తీసుకురావాలంటే ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయ్ సహకారం ఎంతో అవసరమని, కాబట్టి కూటమి అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పని చేయలేని వారికి ఓటు వేస్తే గత ప్రభుత్వ హయాంలో లాగే అభివృద్ధి కుంటుపడుతుందని ఆమె విమర్శించారు. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందని పద్మావతి వివరించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 1900 వీధిలైట్లు మంజూరు చేయగా, ఇప్పటికే పలు చోట్ల ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణ సుందరీకరణ కోసం మరో రూ. 2 కోట్లు మంజూరయ్యాయని, ఎన్నికల అనంతరం ఆ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. 19వ వార్డులో రూ. 1.20 కోట్లతో 10 సీసీ రోడ్లు నిర్మించామని ఆమె గుర్తుచేశారు. అలాగే రూ. 20 లక్షలతో వాటర్ ట్యాంక్, రూ. 24 లక్షలతో రామాలయం నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. నర్సీపట్నంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు రూ. 185 కోట్లు మంజూరయ్యాయని, ఏడాదిలోగా ఆ పనులు పూర్తవుతాయని వెల్లడించారు.

​కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని పద్మావతి తెలిపారు. గత ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేయగా, కూటమి ప్రభుత్వం వాటిని తిరిగి ప్రారంభించిందని కొనియాడారు. ఎన్నికల హామీ మేరకు పింఛను రూ. 4000కు పెంచామని, తొలి నెలలోనే బకాయిలతో కలిపి రూ. 7000 ఇచ్చి, ఇప్పుడు ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ. 4000 అందిస్తున్నామని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రైతులకు రూ. 20 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, దీపావళి పండుగ నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, పరిస్థితులు చక్కబడిన వెంటనే మహిళలకు నెలకు రూ. 1500 అందించే పథకాన్ని కూడా తప్పకుండా అమలు చేస్తామని పద్మావతి భరోసా ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే మున్సిపాలిటీని ‘స్వచ్ఛ నర్సీపట్నం’గా తీర్చిదిద్ది చూపిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాబోయే ఒకటో తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుందని, కౌన్సిలర్ అభ్యర్థికి మరియు చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ‘సైకిల్’ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular