బాపట్ల, అక్టోబర్ 12 (పెన్ పవర్):
ప్రజారోగ్య పరిరక్షణలో అంకితభావంతో వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్‌కు బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఉత్తమ వైద్యుడు’ పురస్కారం లభించింది. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రెడ్ క్రాస్ సమావేశ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఉప్పుటూరు పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు, బాపట్లలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలోనూ రోగులకు విశేష సేవలందిస్తున్నారు. రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, అవసరమైన వారికి తగిన కౌన్సిలింగ్ అందిస్తున్నారు. ఆయన అంకితభావంతో కూడిన సేవలకు రోగుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, తనకు లభించిన పురస్కారం వెనుక రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ బట్టు, ఇతర సభ్యుల సహకారం ఎంతో ఉందన్నారు. ఈ అవార్డు ఘనత వారికే దక్కుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పేద ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

