ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అభినందనీయం
ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి
, రంపచోడవరం, పెన్ పవర్ అక్టోబర్ 11:
గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, ఆదివాసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి పేర్కొన్నారు. పోలవరం జిల్లా రాకోటు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘అడవిబాట 2.0’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
నూతన పోలవరం జిల్లా ఏర్పాటు అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం శుభపరిణామమని బొజ్జిరెడ్డి అభిప్రాయపడ్డారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి, ఆదివాసీల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఇటువంటి పర్యటనలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారు.
గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి వ్యక్తం చేశారు.

