పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు!
వీధి దీపాలు వెలగక రాత్రివేళల్లో గ్రామస్థుల అవస్థలు
చీకటి కారణంగా దొంగతనాల భయం.. ప్రజల్లో ఆందోళన
తక్షణమే చర్యలు చేపట్టాలి: టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు ముచ్చకర్ల శివప్రసాద్
గంగవరం, అక్టోబర్ 13 (పెన్ పవర్):
గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో నెలకొన్న వీధి దీపాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని రంపచోడవరం నియోజకవర్గ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు ముచ్చకర్ల శివప్రసాద్ డిమాండ్ చేశారు. గ్రామంలో వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రివేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నెల్లిపూడి గ్రామంలో వీధి దీపాల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ నేటికీ పరిష్కారం చూపకపోవడం విచారకరమన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా గ్రామస్థులు చీకట్లోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు.
ముఖ్యంగా రాత్రివేళల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో గ్రామంలో దొంగతనాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సి వస్తోందన్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన ఇలాంటి సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదని పేర్కొన్నారు.
గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని గుర్తుచేశారు. ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నెల్లిపూడి గ్రామంలోని వీధి దీపాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, రాత్రివేళల్లో ప్రజలు నిర్భయంగా సంచరించేలా చర్యలు చేపట్టాలని ముచ్చకర్ల శివప్రసాద్ కోరారు.

