ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరగనున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభ లను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు చింత బాబు పిలుపునిచ్చారు.మండలం లోని నగరం గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలని శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది ఎకరాల గిరిజన భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ‘అటవీ సంరక్షణ నియమాల చట్టం-2023’ను తీసుకొచ్చారని చెప్పారు. అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న కోట్లాది మందిని బలవంతంగా నిర్వాసితులను చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివాసీలకు రక్షణగా ఉన్న 1/70 చట్టం, పెసా చట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కాలరాస్తోందని విమర్శించారు.ఆదివాసీల హక్కులు, జల, జంగల్, జమీన్ పరిరక్షణ, పోడు భూముల సమస్యలు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలపై ఈ మహాసభలలో చర్చించనున్నట్లు తెలిపారు.ఆదివాసీ గ్రామాల నుంచి ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా మహాసభకు తరలిరావాలని కోరారు. ఐక్యతే ఆదివాసీల బలమని, హక్కుల సాధన కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలకృష్ణ,గ్రామ నాయకులు సంపత్, భద్రయ్య, సత్యం, మంగయ్య, సమ్మక్క, హరికృష్ణ, నరేష్,నర్సయ్య, రామకృష్ణ, అబ్బయ్య, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలి
RELATED ARTICLES

