ePaper
Friday, June 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విజయనగరంరూట్ మార్చిన కోలగట్ల..

రూట్ మార్చిన కోలగట్ల..

📰 Generate e-Paper Clip

వైసీపీలో కొత్త చర్చలకు తెర
వారసురాలి కోసం వ్యూహాత్మక మౌనం..!
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి నెమ్మదించిన కోలగట్ల
పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న సందేహాలు
కుమార్తె శ్రావణి భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి
మేయర్ పదవిపై కోలగట్ల వ్యూహం?
అధిష్టానంపై ఒత్తిడి కోసం మౌన రాజకీయాలు
వైసీపీ నాయకత్వం స్పందన ఏంటి?
వారసురాలి రాజకీయ భవిష్యత్తు కోసమేనా కోలగట్ల మౌనం?
విజయనగరం రాజకీయాల్లో కొత్త చర్చలకు కారణమైన మాజీ డిప్యూటీ స్పీకర్ వ్యూహం

ఒకప్పుడు విజయనగరం రాజకీయాల్లో నిత్యం ప్రజల మధ్య కనిపించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటుండటం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ మార్పు వెనుక రాజకీయ వ్యూహమా? లేక తన కుమార్తె శ్రావణి రాజకీయ భవిష్యత్తు కోసం వేసిన ఎత్తుగడా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పెన్ పవర్ ప్రత్యేక ప్రతినిధి విజయనగరం, జూన్ 11:

విజయనగరం జిల్లా రాజకీయాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే గడిపే నాయకుడిగా గుర్తింపు పొందిన కోలగట్ల.. ఇటీవల రాజకీయ కార్యక్రమాల్లో అంతగా చురుకుగా కనిపించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ముఖ్యంగా సొంత పార్టీ వైసీపీ నాయకులే ఆయన రాజకీయ వైఖరిలో వచ్చిన మార్పుపై చర్చించుకుంటున్నారు.

గతంలో పార్టీ సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విధానాలపై స్పందనలు వంటి అంశాల్లో ఎప్పుడూ ముందుండే కోలగట్ల.. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు పరిమిత స్థాయిలో మాత్రమే హాజరవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాయకత్వం పిలిస్తే కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ, స్వయంగా ముందుండి కార్యక్రమాలు నిర్వహించే ధోరణి తగ్గిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన మౌనం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జోరందుకుంది. జిల్లాలో వినిపిస్తున్న చర్చల ప్రకారం, కోలగట్ల ప్రస్తుతం తన కుమార్తె శ్రావణి రాజకీయ భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. గతంలో డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన శ్రావణిని భవిష్యత్తులో విజయనగరం రాజకీయాల్లో కీలక స్థానంలో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.అందులో భాగంగానే ప్రస్తుతం తాను ఒకడుగు వెనక్కి వేసి, వారసత్వ రాజకీయాలకు బాటలు వేయాలని భావిస్తున్నట్టు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని లక్ష్యంగా పెట్టుకుని రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో శ్రావణిని వైసీపీ తరపున మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని, ఆ మేరకు పార్టీ అధిష్టానం నుంచి ముందస్తు హామీ కోరుతున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాను రాజకీయంగా ప్రభావం కలిగి ఉన్న ఈ సమయంలోనే కుమార్తెకు భవిష్యత్ అవకాశాలను ఖరారు చేయాలనే ఉద్దేశంతో కోలగట్ల అడుగులు వేస్తున్నారని అంటున్నారు.ఈ నేపథ్యంలోనే పార్టీపై నేరుగా ఒత్తిడి చేయకుండా, వ్యూహాత్మక మౌనం పాటిస్తూ తన అసంతృప్తిని సంకేతాల రూపంలో వ్యక్తం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఆ వ్యూహంలో భాగమేనని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వైసీపీ నాయకత్వం మాత్రం ఈ ప్రచారాలపై స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఇప్పుడే ఎలాంటి హామీలు ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయానికి రాజకీయ పరిస్థితులు, స్థానిక సమీకరణాలు, పార్టీ అవసరాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.మొత్తంగా కోలగట్ల రాజకీయ మౌనం విజయనగరం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. ఇది నిజంగా వారసత్వ రాజకీయాల కోసం అమలు చేస్తున్న వ్యూహమా? లేక రాజకీయ పరిస్థితులను అంచనా వేసే వరకు తీసుకున్న తాత్కాలిక నిర్ణయమా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular