అక్షయపాత్రలా మారిన టీటీడీ నిత్యాన్నదానం
రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం..
తిరుమలలో మహాయజ్ఞంలా సేవలు
41 ఏళ్లుగా నిరంతరంగా సాగుతున్న అన్నదాన మహాయజ్ఞం
రోజుకు 15.8 టన్నుల బియ్యంతో లక్షల మందికి భోజనం
భక్తుల విరాళాలతో రూ.2,460 కోట్ల ట్రస్ట్ నిధులు
ఐదు నెలల్లో 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్
వకుళమాత కిచెన్‌తో విస్తరించిన సేవల పరిధి
ఆధునిక శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి చర్యలు
శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తుడికి తృప్తికరమైన భోజనం అందించాలనే సంకల్పంతో టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. భక్తుల విరాళాలతో నడుస్తున్న ఈ మహా కార్యక్రమం రోజుకు దాదాపు మూడు లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తూ నిజమైన అక్షయపాత్రగా మారింది. రూ.2,460 కోట్లకు పైగా నిధులతో, అత్యాధునిక వంటశాలలతో, రోజుకు 15.8 టన్నుల బియ్యం వినియోగంతో సాగుతున్న అన్నప్రసాద సేవలు తిరుమలలో భక్తి, సేవా భావాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. 2026 తొలి ఐదు నెలల్లోనే 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్ అందించడం ఈ కార్యక్రమం విస్తృతిని తెలియజేస్తోంది.
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ తిరుమల, పెన్ పవర్, జూన్ 12:
తిరుమల, న్యూస్ పల్స్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు ఆకలి తీర్చే పవిత్ర సేవగా టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత భోజన కార్యక్రమాల్లో ఒకటిగా ఎదిగింది. భక్తుల విరాళాలతో నడుస్తున్న ఈ సేవ రోజురోజుకూ విస్తరిస్తూ నిజమైన అక్షయపాత్రగా మారింది. 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన నిత్యాన్నదాన పథకం ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత సమర్థవంతంగా కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది వరకు, వారాంతాలు మరియు పర్వదినాల్లో 3 లక్షలకు పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.
రోజూ టన్నుల కొద్దీ ఆహార పదార్థాల వినియోగం
లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ భారీ స్థాయిలో ఆహార పదార్థాలను వినియోగిస్తోంది. రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 1,729 కిలోల మినప్పప్పు, 1,276 కిలోల బెల్లం, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ వినియోగిస్తున్నారు. అదనంగా వేలాది కొబ్బరికాయలు, వందల కిలోల చక్కెర, ధనియాలు, ఎండు మిర్చి వంటి పదార్థాలు ప్రతిరోజూ ఉపయోగిస్తున్నారు.
రోజుకు 3 లక్షల సర్వింగ్స్
టీటీడీ గణాంకాల ప్రకారం రోజుకు సుమారు 70 వేల మందికి పాలు, టీ, కాఫీ వంటి పానీయాలు అందిస్తున్నారు. అలాగే 60 వేల మందికి పైగా అల్పాహారం, దాదాపు లక్ష మందికి మధ్యాహ్న భోజనం, 56 వేల మందికి పైగా రాత్రి భోజనం అందిస్తున్నారు. మొత్తంగా రోజుకు మూడు లక్షల వరకు సర్వింగ్స్ జరుగుతున్నాయి.
ఐదు నెలల్లో 4.40 కోట్ల సర్వింగ్స్
2026 జనవరి నుంచి మే నెలాఖరు వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా మొత్తం 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్ అందించారు. జనవరిలో కోటి సర్వింగ్స్ నమోదు కాగా, ఫిబ్రవరిలో 71 లక్షలు, మార్చిలో 84 లక్షలు, ఏప్రిల్‌లో 85 లక్షలు, మే నెలలో 92 లక్షలకు పైగా సర్వింగ్స్ నమోదయ్యాయి. ఈ గణాంకాలు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు అన్నప్రసాద సేవల విస్తృతిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
రూ.2,460 కోట్ల నిధులతో బలమైన ట్రస్ట్
శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు ప్రస్తుతం రూ.2,460 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. భక్తులు సమర్పించే విరాళాలు, వాటిపై వచ్చే వడ్డీ ఆదాయంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ట్రస్ట్ నిరంతరం సేవలను విస్తరిస్తోంది.
ఆధునికీకరణతో మరింత విస్తరణ
అన్నప్రసాద సేవల నాణ్యత పెంపు కోసం టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. 2024లో ప్రారంభించిన వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అదనంగా 28 ప్రాంతాలకు ఆహార సరఫరా విస్తరించింది. కొత్తగా ప్రారంభించిన పి ఏ సి -5 భవనంలో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే సౌకర్యం కల్పించారు. అంతేకాక రోజుకు రెండు లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేసే సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఆధునిక వంట పరికరాలు, క్యాష్‌లెస్ విరాళాల కోసం క్యూ ఆర్ కోడ్ కియోస్క్‌లు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి.
సేవా భావానికి ప్రపంచ గుర్తింపు
భక్తి, సేవ, సమర్థవంతమైన నిర్వహణకు ప్రతీకగా నిలిచిన టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా, నాణ్యమైన భోజనం అందించడం ద్వారా టీటీడీ కేవలం ఆకలి తీర్చడం మాత్రమే కాదు, మానవసేవే మాధవసేవ అనే భావనను ఆచరణలో చూపిస్తోంది.

