Homeఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసి తీరతాం : ప్రత్తిపాటి

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసి తీరతాం : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

  • వాతావరణం అనుకూలించకపోయినా.. సీఎం టూర్ లో ఎలాంటి మార్పు లేదు.
  • సీఎం అనుకున్న సమయానికే చిలకలూరిపేటకు వస్తారు.. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ..సభా వేదిక..ఇతర ఏర్పాట్లు పరిశీలించి, విలేకరులతో మాట్లాడిన ప్రత్తిపాటి.

చిలకలూరిపేట రూరల్ , పెన్ పవర్, జూన్ 19:

చిలకలూరిపేట : స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర, అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ యోజన, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు చిలకలూరిపేటకు రానున్నట్టు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియచేశారు. ముఖ్యమంత్రి పర్యటనను పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ , మరియు స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు. సభావేదిక ఏర్పాటు, జనసమీకరణపై నాయకులతో సమీక్షించిన అనంతరం, సీఎం కార్యక్రమాల నిర్వహణ, హెలిప్యాడ్.. వేదిక నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఏర్పడితే, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం అనుకున్న సమయానికే వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని, అందుకు తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ప్రత్తిపాటి ఆదేశించారు. అనంతరం ప్రత్తిపాటి స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు లేదు..

గురువారం రాత్రి వర్షం కురిసినందున హెలిప్యాడ్ నిర్మాణం కోసం మరో స్థలాన్ని ఎంపిక చేసినట్టు ప్రత్తిపాటి చెప్పారు. వాతావరణం అనుకూలించని పక్షంలో కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు, ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నవిధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని, వాయిదా ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, గొట్టిపాటి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ సహా, పలుకీలక నేతలు హాజరవుతాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

ఉదయం 11 నుంచి సాయంత్రం 6.30 వరకు సీఎం చిలకలూరిపేటలో ఉంటారు.

శనివారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చిలకలూరిపేటకు వస్తారని, సాయంత్రం 6.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రత్తిపాటి చెప్పారు. తొలుత స్థానిక అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు..గర్భిణులకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలిస్తారని ప్రత్తిపాటి చెప్పారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నూనె గానుగ కేంద్రాన్ని, గోశాలను పరిశీలించిన అనంతరం భోజన విరామం ఉంటుందన్నారు. అనంతరం నియోకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుందని, టీడీపీ అధినేత వారి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకొని, ప్రతిఒక్కరితో ఫోటోలు దిగుతారని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజల సంతోషం, సంక్షేమంతో పాటు. రెండేళ్లలో కూటమిప్రభుత్వం చేసిన అభివృద్ధిని సీఎం ప్రజలకు వివరిస్తారన్నారు.

47 లక్షల మందికి అన్నదాతా సుఖీభవ నిధుల జమ

సాయంత్రం 4 గంటలకు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ యోజన ప్రజావేదికలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ప్రత్తిపాటి చెప్పారు. లింగంగుంట్లలో జరిగే కార్యక్రమం సాక్షిగా రాష్ట్రంలోని సుమారు 47 లక్షల మంది రైతులకు ముఖ్యమంత్రి అన్నదాతా సుఖీభవ నిధులు జమచేస్తారన్నారు. ముఖ్యమంత్రి ప్రజావేదిక కార్యక్రమానికి కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని ప్రత్తిపాటి కోరారు.

ఈ కార్యక్రమంలో జేసీ సంజన సిన్హా, ఎఎస్పీ సంతోష్, ఆర్డీవో బాలకృష్ణ, డీఎస్పీ హనుమంతరావు, నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular