Homeఆంధ్రప్రదేశ్సాయికృష్ణ మిస్టరీ కేసు: ‘దృశ్యం’ తరహాలో అదృశ్యమయ్యాడా..?

సాయికృష్ణ మిస్టరీ కేసు: ‘దృశ్యం’ తరహాలో అదృశ్యమయ్యాడా..?

📰 Generate e-Paper Clip

పోలీసులపై పెరుగుతున్న అనుమానాలు
ఆనవాళ్లు దొరకకపోతే పోలీసులకే చట్టపరమైన చిక్కులా..!
మార్కాపురం నుంచి మొదలైన మిస్టరీ
కోర్టులో పోలీసుల వైఖరిపై కొత్త ప్రశ్నలు
పటమట – కృష్ణలంక సర్కిళ్లలో ఏం జరిగింది?
సెక్షన్ 106 ప్రకారం బాధ్యత ఎవరిది?
శవం లేకున్నా నేరం రుజువయ్యే అవకాశాలు
హైకోర్టు గడువు.. పోలీసులకు పరీక్షా సమయం

మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న తర్వాత సాయికృష్ణ అదృశ్యమైన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పూర్తి స్థాయిలో బాధ్యతను నిరాకరించలేకపోవడం, హైకోర్టు జోక్యం నేపథ్యంలో ఈ కేసు ‘దృశ్యం’ సినిమా తరహా మిస్టరీగా మారుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్టేట్ బ్యూరో పెన్ పవర్, అమరావతి జూన్ 22: 

సాయికృష్ణ అదృశ్య ఘటన రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. సాధారణంగా కస్టడీ మరణాలు లేదా అనుమానాస్పద ఘటనల్లో బాధితుడిని ఆసుపత్రికి తరలించడం, గుండెపోటు లేదా ఇతర కారణాలను చూపించడం వంటి ఆరోపణలు గతంలో వినిపించాయి. అయితే ఈ కేసులో మాత్రం సాయికృష్ణకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు బయటకు రాకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, న్యాయవర్గాలు, ప్రజల్లో ‘దృశ్యం’ సినిమా కథతో పోలికలు వినిపిస్తున్నాయి. సినిమాలో నేరానికి సంబంధించిన ఆధారాలను పూర్తిగా మాయం చేసినట్లుగా, ఇక్కడ కూడా సాయికృష్ణ జాడ లేకపోవడం కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది.

మార్కాపురం నుంచి మొదలైన అనుమానాలు : అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మార్కాపురం ప్రాంతంలో పట్టుబడిన కొందరితో పాటు సాయికృష్ణను కూడా పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లినట్లు ప్రచారం ఉంది. మిగిలిన వారిని విచారించి వదిలేశారని సమాచారం. అయితే సాయికృష్ణ మాత్రం అప్పటి నుంచి కనిపించకపోవడం కేసులో కీలక అంశంగా మారింది.ఇదే సమయంలో పటమట, కృష్ణలంక పోలీస్ పరిధుల్లో జరిగిన పరిణామాలపై స్పష్టత లేకపోవడం ప్రజల్లో అనుమానాలను మరింత పెంచుతోంది.

పూర్తిగా ఖండించలేకపోతున్న పోలీసులు : ఈ కేసులో అత్యంత ఆసక్తికర అంశం ఏమిటంటే.. సాయికృష్ణను పోలీసులు ఎప్పుడూ అదుపులోకి తీసుకోలేదని పూర్తి స్థాయిలో ప్రకటించలేకపోవడం. ఒకవేళ తమకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పగలిగితే వివాదం అక్కడితో ముగిసే అవకాశం ఉండేది.అయితే కోర్టులో పోలీసులు మరింత సమయం కోరడం, విచారణ కొనసాగుతోందని చెప్పడం వంటి పరిణామాలు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. సాయికృష్ణను విచారించి వదిలేశామని చెప్పే అవకాశం పోలీసులకు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అలాంటి స్పష్టమైన వాదనను అధికారికంగా ముందుకు తీసుకురాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సెక్షన్ 106 ఎందుకు కీలకం? : న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కేసులో భారత సాక్ష్యాధార చట్టంలోని సెక్షన్ 106 అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఒక వ్యక్తి చివరిసారిగా ఎవరి ఆధీనంలో ఉన్నాడో నిరూపితమైతే, ఆ తర్వాత అతనికి ఏమైందనే విషయాన్ని వివరించే బాధ్యత కూడా అదే పక్షంపై పడుతుంది.సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు లేదా సాక్ష్యాలు కోర్టు ముందు నిలిస్తే, అతని ఆచూకీపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంటుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

శవం లేకపోయినా శిక్ష పడుతుందా? : సాధారణంగా హత్య కేసుల్లో మృతదేహం కీలక ఆధారంగా పరిగణిస్తారు. అయితే ఆధునిక న్యాయవ్యవస్థలో అది ఒక్కటే ప్రమాణం కాదు. పరిస్థితుల ఆధారాలు, చివరిసారి కలిసి కనిపించిన వ్యక్తులు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు వంటి అంశాలు బలంగా ఉంటే శవం లేకపోయినా నేరం నిరూపించవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. అందువల్ల సాయికృష్ణ ఆనవాళ్లు లభించకపోయినా కేసు ముగిసిపోతుందని భావించడం సరైంది కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైకోర్టు గడువు కీలకం : ప్రస్తుతం అందరి దృష్టి హైకోర్టు విధించిన గడువుపైనే ఉంది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ బయటపడుతుందా? లేక కేసు మరింత మిస్టరీగా మారుతుందా? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవేళ గడువు ముగిసే నాటికి కూడా స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి రాకపోతే, విచారణ సంస్థలపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో సాయికృష్ణ చివరిసారిగా ఎవరి ఆధీనంలో ఉన్నాడనే అంశం కేసు దిశను పూర్తిగా మార్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, హైకోర్టు తదుపరి విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలపై అందరి దృష్టి నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular