Homeఆంధ్రప్రదేశ్కాకినాడఆర్యవటంలో భక్తి వెల్లువ.. సీతారామ సమేత లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాల వైభవ ఊరేగింపు

ఆర్యవటంలో భక్తి వెల్లువ.. సీతారామ సమేత లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాల వైభవ ఊరేగింపు

📰 Generate e-Paper Clip

24న పునఃప్రతిష్ఠ మహోత్సవం.. భక్తులందరికీ ఆలయ నిర్వాహకుల ఆహ్వానం

కాజులూరు, పెన్ పవర్, జూన్ 21: కాజులూరు మండలంలోని ఆర్యవటం గ్రామం ఆదివారం సాయంత్రం భక్తి పారవశ్యంతో మార్మోగింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయస్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా స్వామివారి విగ్రహాలను గ్రామ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రామ ప్రజలను భక్తి భావంలో ముంచెత్తింది.

గ్రామానికి చెందిన దాత సనపల ధనరాజు ఆధ్వర్యంలో, తన తల్లిదండ్రులు స్వర్గీయ సనపల కన్నయ్య – అప్పయ్యమ్మ దంపతుల స్మారకార్థం ఈ నూతన ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం ధనమ్మతల్లి ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు తుమ్మలపల్లి లంక, ముత్తావారి గరువు మీదుగా ఆర్యవటం గ్రామమంతా సాగింది. స్వామివారి విగ్రహాలను దర్శించేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హారతులు సమర్పించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, యువకులు భక్తి నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

నూతన ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణలు, పచ్చని మామిడి తోరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశిస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న అనంతరం సనపల ధనరాజు, ఆయన సతీమణి ఇందిర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు.

ఈ సందర్భంగా సనపల ధనరాజు మాట్లాడుతూ, జూన్ 22 నుంచి 24 వరకు పునఃప్రతిష్ఠ మహోత్సవాలు వైదిక సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. యాగశాల పూజలు, విష్వక్షేనారాధన, అంకురార్పణ, వాస్తుపూజ, అగ్ని ప్రతిష్ఠ, గరుడ ప్రతిష్ఠ, నవకలశారాధన, గోపూజ, జలాధివాసం, క్షీరాధివాసం, హోమాలు, అభిషేకాలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

జూన్ 24న ఉదయం విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని, అనంతరం భక్తులందరికీ భారీ అన్నసమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయస్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు, దాత సనపల ధనరాజు భక్తులను ఆహ్వానించారు.

ఆర్యవటం గ్రామంలో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలు గ్రామానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చి, భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular