కమిటీల నియామకాలు, స్థానిక ఎన్నికల వ్యూహంపై చర్చ
స్టాప్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 30:అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని పాడేరు కేంద్రానికి ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్ పరిశీలకులు కొణిదెల నాగబాబు జూలై 1న పర్యటించనున్నట్లు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య తెలిపారు.ఈ మేరకు ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, జులై 1వ తేదీ ఉదయం 10:30 గంటలకు పాడేరులోని వీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ముఖ్య సమావేశంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పాల్గొంటారని పేర్కొన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు.అలాగే మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ పదవులను ఆశించే నాయకులు, కార్యకర్తలు తమ దరఖాస్తులను నేరుగా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు అందజేయవచ్చని గంగులయ్య పేర్కొన్నారు.జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

