జనసంద్రంగా మారిన నర్సీపట్నం
భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో పసుపు మయం
నర్సీపట్నం చరిత్రలో వినూత్న స్వాగత ఏర్పాట్లు
నర్సీపట్నం, పెన్ పవర్:
రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి నర్సీపట్నం వచ్చిన చింతకాయల విజయ్ కు ఘన స్వాగతం లభించింది. భారీ ఓర్డింగులు కటౌట్లతో తెలుగు తమ్ముళ్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్వాగత ఏర్పాట్లతో పట్టణమంతా పసుపు మయమయింది. గుర్రాలతో స్వాగతం ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్య కూడళ్లలో క్రేన్ల సాయంతో భారీ గజమాలలతో ఎంపీ విజయ్ బాబును అభిమానులు సత్కరించారు. ముందుగా ఆయన నర్సీపట్నం దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది ప్రజలు, అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దారిపొడవునా ఇసుకవేస్తే రాలనంత జనసందోహంతో ఈ ర్యాలీ నర్సీపట్నంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొని విజయ్ ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు. భవిష్యత్తులో జిల్లాను విజయ్ ముందుకు నడిపించాలని గండి బాబ్జీ ఆకాంక్షించారు. సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ వైసీపీ హయాంలో అయ్యన్న కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, చెరువులను ఆక్రమించింది వైసీపీ నాయకులేనని విమర్శించారు. పెద్ద చెరువులో శివ పార్వతులు ఏర్పాటును అడ్డుకోవడం సిగ్గుచేటని, విజయ్ పడిన కష్టానికి దక్కిన ఫలితమే ఈ రాజ్యసభ పదవి అని కొనియాడారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ రాజ్యసభలో పలువురు సభ్యులు తెలుగులో ప్రమాణస్వీకారం చేస్తే, విజయ్ హిందీలో అనర్గళంగా చేశారని, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదని ప్రశంసించారు. దేశంలోనే అతి చిన్న వయసులో రాజ్యసభ సభ్యుడు కావడం చిన్న విషయం కాదని, అనకాపల్లి పార్లమెంటు అభివృద్ధికి తామిద్దరం కలిసి సమష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

హోం మంత్రి అనిత ప్రసంగిస్తూ సైకోలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం ఎంతో కష్టమని, అయినా వారి కుట్రలను, కేసులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తులు అయ్యన్న, విజయ్ లే అని ప్రశంసించారు. అయ్యన్న ఒకే పార్టీకి కట్టుబడి ఉన్న నాయకుడని, ఆయనపై కేసులు పెట్టిన రోజు కూడా ఏమాత్రం వెనుకడుగు వేయలేదని గుర్తుచేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో విజయ్ భాగస్వామ్యం కావడం శుభపరిణామం అన్నారు. వైసీపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టడంలో విజయ్ కీలక పాత్ర పోషించారని, అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టించింది అయ్యన్న, విజయ్ లేనని అన్నారు. అమరావతిపై గత ప్రభుత్వం దోబూచులాడిందని, అక్కడికి వెళితే రైతులు తరిమికొట్టారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో చివరకు 11 సీట్లకు పరిమితమయ్యారని, జగన్ మళ్లీ మావిగన్ పేరు ఎత్తితే సున్నానే మిగులుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ సారథ్యంలో, చంద్రబాబు విధానాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ అభివృద్ధి పరుగులు పెడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ స్పీకర్ పదవి ఇచ్చి తన నోటికి తాళం వేశారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇది సన్మాన సభ కాదని, ఆశీర్వాద సభ అని పేర్కొన్నారు. నర్సీపట్నం ప్రజలు 120 ఏళ్లుగా తమ కుటుంబానికి అండదండలు అందిస్తూ ముందుకు నడిపించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులను పార్టీ నాయకులు బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించిన ఆయన, తప్పుడు పనులను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని స్పష్టం చేశారు.
సభలో చివరగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, నియోజకవర్గ ప్రజల సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా తాను ముందుండి పోరాడతానని భరోసా ఇచ్చారు. తాను ఎప్పటికీ పార్టీ జెండాకు కూలీగా పనిచేస్తానని చంద్రబాబుకు మాటిచ్చానని, దానికి తగ్గట్టుగానే గతంలో ఇచ్చిన మాటను తాను నిలబెట్టుకున్నానని చంద్రబాబు చెప్పారని గుర్తుచేసుకున్నారు. తనను సొంత కుటుంబ సభ్యుడిలా భావించిన నారా లోకేష్ ఈ అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. జగన్ కు దమ్ముంటే పులివెందుల వదిలి బయటకు వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా లోకేష్ కష్టమైన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి చూపించారని కొనియాడారు. నర్సీపట్నం గడ్డ మీద పుట్టడం తనకు ఎంతో గర్వకారణమని, గతంలో తన ఇంటిమీదకి వచ్చినప్పుడు, అరెస్టులు చేసినప్పుడు నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని అండగా నిలిచిన తీరును ఎన్నటికీ మరువలేనని భావోద్వేగానికి గురయ్యారు.

