900, 999 బస్సులను పునరుద్ధరించాలి అధికారులకు గంటా శ్రీనివాస్ ఆదేశం
4వ వార్డులో రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,విశాఖపట్నం , జూలై 03 : భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
భీమిలి పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే 900, 999 నంబర్ బస్సులను నిలిపివేయడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కళాశాల అధ్యాపకురాలు రూపతో పాటు విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని, ప్రత్యామ్నాయ రవాణా వారికి భారంగా మారిందని వివరించారు. దీనిపై స్పందించిన గంటా శ్రీనివాసరావు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడుతో మాట్లాడి వెంటనే 900, 999 నంబర్ బస్సులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే 4వ వార్డులోని ఐఎన్ఎస్ కళింగ, నిడిగట్టు ప్రాంతాల మీదుగా బస్సు సర్వీసులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
4వ వార్డులో తొలి దశలో రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం సీఎల్డీపీ కింద భూములు ఇచ్చిన 520 మంది నిర్వాసితులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
1వ వార్డులో రేషన్ డిపో మంజూరు చేయడంతో పాటు రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు వినతిపత్రం సమర్పించారు. 6వ వార్డులోని సాయిబాబా ఆలయ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ ఏయూ ఉద్యోగి ప్రసాదరావు కోరారు. భీమిలి మండలంలోని దాకమర్రి, మజ్జివలస, మజ్జిపేట, సింగనబంద గ్రామాల్లో రీ-సర్వే సక్రమంగా జరగలేదని, మళ్లీ నిర్వహించాలని జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు విజ్ఞప్తి చేశారు. ముకుందపురంలో సాగులో ఉన్న భూములను ఆక్రమించి ప్రైవేట్ సెక్యూరిటీతో రైతులను వేధిస్తున్నారనే ఫిర్యాదుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెవెన్యూ అధికారులు వాస్తవాలు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నేరళ్లవలసలో ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే 5, 6, 8 వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయగా, తాత్కాలిక చర్యలతో సమస్యను తగ్గిస్తామని, రూ.750 కోట్ల తాగునీటి ప్రాజెక్టు పూర్తయితే శాశ్వత పరిష్కారం లభిస్తుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదుల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే అంశంపై సీవీఏపీ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.

