Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంక్రమశిక్షణే విజయానికి పునాది: ఎమ్మెల్యే గంటా

క్రమశిక్షణే విజయానికి పునాది: ఎమ్మెల్యే గంటా

చంద్రంపాలెం హైస్కూల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం

క్రమశిక్షణే విజయానికి పునాది: ఎమ్మెల్యే గంటా

ఆగస్టు 15 నాటికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఆధునిక క్రీడా మైదానం సిద్ధం చేయాలని ఆదేశం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 03 : రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటైన చంద్రంపాలెం హైస్కూల్‌కు పూర్వ వైభవం తీసుకురావడంలో ఎలాంటి రాజీ ఉండదని, క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం చంద్రంపాలెం హైస్కూల్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాలు, పరిపాలనపై విస్తృతంగా చర్చించారు.

పాఠశాల హెచ్‌ఎం వెంకట్రావు వ్యవహార శైలిపై ఉపాధ్యాయులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్న గంటా, ఒకప్పుడు అడ్మిషన్లు లేకపోవడంతో బోర్డులు పెట్టే స్థాయిలో ఉన్న ఈ పాఠశాల ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాల పరంగా వెనుకబడటం బాధాకరమన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేస్తేనే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు.

తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో శ్రీలంకలో 7,500 మంది విద్యార్థులతో నడిచే పాఠశాలను సందర్శించానని, అక్కడ హెచ్‌ఎంతో పాటు సీనియర్ ఉపాధ్యాయులు కూడా తరగతులు నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు గమనించానన్నారు. ఆ తరహా విధానాన్ని ఇక్కడ అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమర్థుడైన హెచ్‌ఎం పేరును ప్రతిపాదించాలని సూచించారు.

పాఠశాలలో డైనింగ్ హాల్ లేకపోవడంతో విద్యార్థులు వరండాలు, ఆరుబయట మధ్యాహ్న భోజనం చేయాల్సి వస్తోందని గంటా ప్రస్తావించారు. నిధుల సమస్యపై అధికారులు వివరణ ఇవ్వగా, అవసరమైన నిధుల సమీకరణ బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న భవనాల్లో లేదా పై అంతస్తులో డైనింగ్ హాల్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

రూ. కోటితో ఆధునిక క్రీడా మైదానం

దివీస్ సీఎస్ఆర్ నిధులతో రూ. కోటి వ్యయంతో అభివృద్ధి చేస్తున్న క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులతో పాటు వాకింగ్ ట్రాక్‌ను ఆధునిక ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. గతంలో వర్షం వస్తే చెరువును తలపించే మైదానం, ప్రస్తుతం విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా వేదికగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

అదే సందర్భంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన గంటా శ్రీనివాసరావు, ఆగస్టు 15 నాటికి ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు క్రీడా మైదానం పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఈఓ ఎన్. ప్రేమ్‌కుమార్, ఆర్‌జేడీ బి. విజయ్ భాస్కర్, డిప్యూటీ డీఈఓ ఎ. సోమేశ్వరరావు, ఎంఈఓ సీహెచ్. రవీంద్రబాబు, జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, ఏఎంహెచ్ఓ రవికుమార్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular