భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విశాఖపట్నం, జూలై 24: యువత భవిష్యత్తు, విద్యా రంగ అభివృద్ధే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు అమలయ్యాయని, కొత్త ఐఐటీలు, ఐఐఎంలు, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల స్థాపనతో పాటు దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు గణనీయంగా తగ్గాయని, నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.
నీట్ అంశాన్ని సాకుగా చేసుకుని కొందరు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, మత విద్వేషాలను ప్రేరేపించే విధంగా ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని, సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిరసనల పేరుతో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ప్రకాశ్ రాజ్ సహా కొందరు దేశ వ్యతిరేక ధోరణిలో మాట్లాడారని విమర్శించారు. వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపును ప్రశ్నిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలపై పార్లమెంట్‌లో చర్చించాలని రాహుల్ గాంధీని ఆయన సవాల్ చేశారు.
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తున్నారని, ఆయనకు కూటమి తరఫున ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 13 వేల మంది కళాకారులతో థింసా నృత్యం, బొబ్బిలి వీణా నాదంతో స్వాగతం పలుకనున్నట్లు, మూడు లక్షల మంది పాల్గొనే బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు.
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపు అవుతుందని, ఈ ప్రాంతంలో వెనుకబడిన మండలాలు లేకుండా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు చిరస్థాయిగా నిలిచేలా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం గర్వకారణమన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, పంచదర్ల క్షేత్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అక్కడ గిరి ప్రదక్షిణ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు కే. సురేంద్రమోహన్, యు. సుజాతరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కె. సుహాసిని ఆనంద్, పార్వతీపురం జిల్లా ఇన్‌చార్జి పి. శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి ఎస్‌వీఎస్ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

