Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంవిశాఖలో విజయవంతంగా విద్యాసంస్థల బంద్

విశాఖలో విజయవంతంగా విద్యాసంస్థల బంద్

విశాఖలో విజయవంతంగా విద్యాసంస్థల బంద్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్             విశాఖపట్నం, జూలై 24: న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద “ఛలో పార్లమెంట్” కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు విశాఖపట్నంలో విశేష స్పందన లభించింది.

 

ఈ సందర్భంగా పీడీఎస్‌ఓ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీతో పాటు డాక్టర్ వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బంద్ నిర్వహించారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మద్దిలపాలెం మీదుగా కృష్ణ కాలేజీ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మద్దిలపాలెం సిగ్నల్ వద్ద మానవహారం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో వరుసగా చోటుచేసుకుంటున్న పేపర్ లీకేజీలు, అవకతవకలు, పరీక్షా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతిపై న్యాయం కోరుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలను కేంద్ర ప్రభుత్వం అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, అరెస్టులను తీవ్రంగా ఖండించారు.

 

2022, 2024, 2026 సంవత్సరాల్లో వరుసగా జరిగిన నీట్ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పేపర్ లీకేజీల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఏ)ను రద్దు చేసి వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌ఓ నాయకులు విశ్వనాథ్, లక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు అజయ్, సాయి తేజ, కుసుమాంజలి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు నాగరాజు, కిరణ్, శేఖర్, డీవైఎఫ్‌ఐ నాయకుడు రాజు, ఏఐవైఎఫ్ నాయకులు అచ్యుతరావు, మధుతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular