జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం
త్వరలో అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు: మంత్రి కొలుసు పార్థసారథి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : రాష్ట్రంలోని జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, అక్రిడిటేషన్ కమిటీల నియామక ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.
బుధవారం డాబాగార్డెన్స్‌లోని విజెఎఫ్ (వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం) ప్రెస్ క్లబ్‌లో మంత్రిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్‌కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి జర్నలిస్టుల 11 పెండింగ్ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ మాట్లాడుతూ ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా “జర్నలిస్టుల డిమాండ్స్ డే” నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరనున్నట్లు చెప్పారు.
అనంతరం మంత్రి కొలుసు పార్థసారథిని జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. గంట్ల శ్రీనుబాబు సింహాద్రి అప్పన్న జ్ఞాపికను మంత్రికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి. రవికుమార్, కార్యవర్గ సభ్యుడు బొబ్బర ప్రసాద్, బ్రాడ్‌కాస్ట్ ప్రతినిధులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్, హరి తదితరులు పాల్గొన్నారు.

