ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : ఆటో, మోటార్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో కూడిన ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి జీవన భద్రతను ప్రభుత్వం కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల ప్రచారంలో భాగంగా బుధవారం విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. వామనమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహాసభల గోడపత్రికను విడుదల చేశారు.
సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 20, 21 తేదీల్లో విశాఖలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి ఆటో స్టాండ్ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొనాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న కొత్త నిబంధనలు, పెరుగుతున్న జరిమానాలు ఆటో, మోటార్ కార్మికులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని పేర్కొన్నారు. స్త్రీ శక్తి పథకం అమలుతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని, వారికి నెలకు రూ.10,000 జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా పెండింగ్ చలానా కేసులను రద్దు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి జే. రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జిల్లా నాయకులు ఎం. మన్మధరావు, జి.ఎస్.ఏ. అచ్యుతరావు, షేక్ రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

