విశాఖ అభివృద్ధికి ఎంపీ శ్రీభరత్ కృషి ప్రశంసనీయం: పట్టాభిరాం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : విశాఖ నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న విశాఖ పార్లమెంట్ సభ్యుడు మతుకుమిల్లి శ్రీభరత్ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం ఆకాంక్షించారు.
ఎంపీ శ్రీభరత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పట్టాభిరాం ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్‌లోనూ, బయటా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీభరత్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. మాజీ ఎంపీ డాక్టర్ ఎం.వి.వి.ఎస్. మూర్తి విద్యా సేవలను కొనసాగిస్తూ గీతం విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను మరింత పెంచే దిశగా శ్రీభరత్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాతకు తగ్గ మనుమడిగా ప్రజల ఆదరణ పొందుతున్నారని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవీఎంసీపై కూటమి జెండా ఎగురవేయాలని, పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ మాట్లాడుతూ, దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్, ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ, వానపల్లి గాయత్రి, బొట్ట వెంకటరమణ, పొలిమేర సీతారాం, బైరెడ్డి పోతనరెడ్డి, బమ్మిడి ఉమా, అబ్దుల్ అనీఫ్, వాసుపల్లి దానిష్, ఎర్నాగుల జగదీష్, గరికిన ఎల్లయ్య, కొల్లి చిరంజీవి, బొరా అప్పలసూరి, పి. ధర్మారావు, ఉమ్మి పోలరావు, బుచ్చరామిరెడ్డి, సీఎం రమణ, కోట నరేష్, బోయి వెంకటరమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

