✒️
బడుగుల బతుకులకు అక్షర దీపం వెలిగించిన రావిశాస్త్రి:
ఘనంగా జయంతి వేడుకలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 30:
తాడిత, పీడిత ప్రజల జీవితాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ వారికి అక్షరాల ద్వారా వెలుగులు నింపిన మహానీయుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) అని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం బీచ్ రోడ్డులోని రావిశాస్త్రి విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొని రావిశాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల జీవితాలను మార్చాలనే సంకల్పంతో రావిశాస్త్రి అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని ఎన్నో విలువైన రచనలు చేశారని పేర్కొన్నారు. సగటు మనిషి, రత్తాలు–రాంబాబు, ఆరు సారా కథలు వంటి రచనలు నేటికీ సమాజానికి దర్పణంగా నిలుస్తున్నాయని అన్నారు.
రావిశాస్త్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిష్ట్లా శ్రీనివాసమూర్తి (వాసు) మాట్లాడుతూ, న్యాయవాదిగా, సమాజ సేవకుడిగా, రచయితగా రావిశాస్త్రి చేసిన సేవలను నేటి యువతకు పరిచయం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆయన రచనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
రావిశాస్త్రి కుమారుడు ఆర్.వి. కుమార్ మాట్లాడుతూ, తన తండ్రి స్ఫూర్తితో ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సాహిత్య సభలు, పుస్తక పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు మాట్లాడుతూ, న్యాయవాదులకు రావిశాస్త్రి చూపిన మార్గం ఆదర్శప్రాయమని అన్నారు.
కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం. రవి, మహమ్మద్ హబీబుల్లా, చీమలపాడు శేఖర్, ఎస్.వి. రమణ, మాకిన రాంబాబు, పి. శ్రీనివాసరావు, షేక్ షరీఫ్, జి. శ్రీనివాసరావుతో పాటు పలువురు న్యాయవాదులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
అక్షర ర్యాలీ ఆకట్టుకుంది
రావిశాస్త్రి జయంతిని పురస్కరించుకుని గాయత్రీ విద్యా పరిషత్ ఎం.ఎల్.బి.టి పాఠశాల విద్యార్థులు బీచ్ రోడ్డులో అక్షర ర్యాలీ నిర్వహించారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు యాదవ్ ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులకు రావిశాస్త్రి రచనలను పరిచయం చేయడం అవసరమని పేర్కొంటూ పాఠశాలకు ఆయన పుస్తకాలను బహుకరించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. మధురవాణి మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ వుడా పార్క్ మీదుగా రావిశాస్త్రి విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

