రావిశాస్త్రి 104వ జయంతి ఘనంగా నిర్వహించారు
ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సాహితీవేత్తల నివాళులు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 30: ప్రముఖ సాహితీవేత్త రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) 104వ జయంతిని గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు రావిశాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ జనసాహిత్యానికి పునాది వేసిన రచయితగా రావిశాస్త్రి చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. తన రచనల ద్వారా సామాన్య ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నత రచయితగా ఆయనను అభివర్ణించారు.
ఆత్మీయ అతిథి అడపా రామకృష్ణ మాట్లాడుతూ రచయితలు దేశానికి అమూల్య సంపద అని, విశాఖ రచయితల సంఘానికి మహాకవి శ్రీశ్రీని పరిచయం చేసిన ఘనత రావిశాస్త్రిదేనని పేర్కొన్నారు. అల్పజీవి నుంచి ఇల్లు వరకు ఆయన రచనలు సామాజిక చరిత్రకు దస్తావేజులుగా నిలిచాయని కొనియాడారు.
విశాఖ సంస్కృతి సంపాదకులు శిరేల సన్యాసిరావు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల సమస్యలను కథల రూపంలో సమాజానికి తెలియజేసి వారి అభ్యున్నతి కోసం రావిశాస్త్రి జీవితాంతం కృషి చేశారని అన్నారు.
ప్రధాన వక్త కళారత్న డాక్టర్ దామెర వెంకట సూర్యారావు మాట్లాడుతూ పాలన, న్యాయ, పోలీసు వ్యవస్థలలోని లోపాలను తన రచనల ద్వారా ఎత్తిచూపిన సామాజిక బాధ్యతగల రచయిత రావిశాస్త్రి అని పేర్కొన్నారు.
శతాధిక గ్రంథకర్త ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ సమాజంలోని అక్రమాలు, అన్యాయాలను తన కలంతో నిర్భయంగా ప్రశ్నించిన సామాజిక చింతకుడు రావిశాస్త్రి అని కొనియాడారు. ఆయన రచనల్లోని భావగర్భితమైన సందేశాలను వివరించారు.
కార్యక్రమానికి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బి. ఆశ ఆహ్వానం పలకగా, ఎం. అమ్ములు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా. ఎం. కృష్ణవేణి, డా. ఎం. దాసు, డా. బి. సూర్యనారాయణ, డా. ఎం. ప్రతాప్, డా. పి. శ్రీనివాసరావు, డా. ఎల్. గిరీష్ కుమార్, డా. ఆర్. శివయ్య, పితాని ప్రసాద్, సాహితీవేత్తలు, భాషాభిమానులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

