Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంనిరుద్యోగ భృతి అమలు చేయాలి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: కేకే రాజు

నిరుద్యోగ భృతి అమలు చేయాలి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: కేకే రాజు

 

 

నిరుద్యోగ భృతి అమలు చేయాలి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: కేకే రాజు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31 : ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కేకే రాజు, ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని, ఉద్యోగం వచ్చేవరకు ఆ భృతి కొనసాగిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే తొలి ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ప్రస్తుతం ఆ హామీల అమలుపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు.

రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని, 20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏ దశలో ఉందో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని అమలు చేయడంతో పాటు ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కుంభ రవి, కట్టుమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు, కటారి అనిల్ కుమార్ రాజు, బొల్లవరపు జాన్ వెస్లీ, అల్లు శంకరరావు, బర్కత్ అలీ, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular