ద్వారకా బస్ స్టేషన్‌లో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
బ్యూరో రిపోర్ట్ పెన్ర్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 05 :
విశాఖపట్నంలోని ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారకా బస్‌స్టేషన్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత భాగ్చి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్‌స్టేషన్‌లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కమిషనర్, ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, పోలీస్ చెక్‌పోస్ట్ సమీపంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ కియోస్క్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కియోస్క్ నిర్వహణలో పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.ద్వారకా బస్‌స్టేషన్‌తో పాటు నగరంలోని ఇతర ప్రధాన బస్‌స్టేషన్లలో కూడా పోలీసు గస్తీని మరింత పెంచాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్), టూ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ కమిషనర్‌కు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ బి. అప్పలనాయుడు స్వాగతం పలికారు. అనంతరం బస్‌స్టేష న్‌లోని వివిధ విభాగాలను సందర్శించిన కమిషనర్, భద్రత, పరిశుభ్రత, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
తనిఖీల సమయంలో ప్రాంతీయ మేనేజర్ బి. అప్పలనా యుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె. పద్మావతి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గంగాధర్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి దుర్గాప్రసాద్, వాల్టేర్ డిపో మేనేజర్ కె.ఎస్.డి. ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ ఎస్.ఎస్. నాయుడు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీ అనంతరం బస్‌స్టేషన్‌లోని మరుగుదొడ్లు, డస్ట్‌బిన్లు, పరిశుభ్రత నిర్వహణ తీరుపై పోలీస్ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు.

