గ్రామాల సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం
ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు క్షేత్రస్థాయి సర్వే
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగస్టు 5 :జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్షేత్రస్థాయి సమాచార సేకరణకు శ్రీకారం చుట్టారు. బుధవారం పాడేరు జిల్లా కలెక్టరేట్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు మాట్లాడారు.ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా గ్రామాలు, పంచాయతీల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం, పంచాయతీకి సంబంధించిన జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, తాగునీరు, విద్యుత్, రహదారులు, విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతుల వివరాలను నమోదు చేయనున్నట్లు చెప్పారు.సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు, గణాంక విశ్లేషణకు ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన సహాయ గణాంక అధికారులు, సాంకేతిక సహాయకులు మండల స్థాయిలో గ్రామ, పంచాయతీ సిబ్బందికి శిక్షణ ఇస్తారని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తి చేసి, ఖచ్చితమైన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ ఇన్‌చార్జి అనుకుల్ కుమార్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ టి. ఫాణి కళ్యాణ్, వివిధ మండలాల సహాయ గణాంక అధికారులు, సాంకేతిక సహాయకులు, శిక్షణార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

