వంటింటి ప్రతిభకు.. ‘సిటీ కుక్’ జోష్!
సరికొత్త రుచులతో మహిళల సృజనాత్మకతకు పట్టం
మహిళల ప్రతిభను ప్రోత్సహించడం అభినందనీయం: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 9 :
మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ, వారి సృజనాత్మకతకు సరైన వేదిక కల్పించడంలో ‘సిటీ కుక్ ఛాంపియన్‌షిప్’ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
రేడియో సిటీ ఆధ్వర్యంలో కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ‘సిటీ కుక్ ఛాంపియన్‌షిప్ సీజన్–3’ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమలోని ప్రతిభను చాటుకోవడం ఆనందంగా ఉందన్నారు. విభిన్న రకాల వంటకాలను సరికొత్త రుచులతో తయారు చేస్తూ మహిళలు ప్రదర్శించిన సృజనాత్మకత అభినందనీయమని పేర్కొన్నారు.
ఇలాంటి పోటీలు కేవలం విజేతలను ఎంపిక చేయడానికే పరిమితం కాకుండా, మహిళలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. గెలుపోటముల కంటే ఐక్యత, స్నేహభావం, ప్రతిభను పరస్పరం పంచుకోవడం ముఖ్యమని అన్నారు.
మహిళలను ప్రోత్సహించేలా ‘సిటీ కుక్ ఛాంపియన్‌షిప్’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న రేడియో సిటీ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులోనూ మహిళల ప్రతిభను వెలికితీసే మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సదరన్ ఇన్స్టిట్యూట్ అధినేత సతీష్ పొన్నం, జనసేన పార్టీ యువ నాయకులు గణేష్, సందీప్, రేడియో సిటీ నిర్వాహకులు, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గున్నారు.

