Homeఆంధ్రప్రదేశ్పల్నాడుఐదేళ్ల ప్రేమకు హత్యతో ముగింపు!

ఐదేళ్ల ప్రేమకు హత్యతో ముగింపు!

ఐదేళ్ల ప్రేమకు హత్యతో ముగింపు!

పట్టించుకోవడం లేదనే అనుమానంతో ప్రియురాలిని హతమార్చిన యువకుడు

అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్‌కు తరలింపు

 

  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        పల్నాడు, ఆగస్టు 9:
ఐదేళ్లుగా కొనసాగిన ప్రేమ బంధం చివరకు విషాదాంతమైంది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఓ యువకుడు ప్రియురాలిని హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది.

చిలకలూరిపేటకు చెందిన హసీనా గుంటూరు జిల్లాలోని మిట్లపల్లి కళాశాలలో బీటెక్ చదువుతున్న సమయంలో కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన బాల సైదులుతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఇద్దరూ ఐదేళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం.

బీటెక్ పూర్తి చేసిన హసీనా సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. మరోవైపు బాల సైదులు తన స్వగ్రామానికి చేరుకుని వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత హసీనా తనతో మాట్లాడటం తగ్గించిందని భావించిన బాల సైదులు ఆమెపై అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో హసీనాను చిలకలూరుపేటకు రప్పించిన బాల సైదులు.. అక్కడి నుంచి కారంపూడి రావాలని కోరినట్లు తెలుస్తోంది. ఆమె అక్కడికి చేరుకున్న అనంతరం కాలువ కట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని కాల్చే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. హసీనా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో కారంపూడి మండలంలోని నాగార్జునసాగర్ కాలువ కట్టపై గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం తదితర ప్రక్రియల అనంతరం అది హసీనాదేనని నిర్ధారించారు.

కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుడైన బాల సైదులును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు తెలిపారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular