స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన
నరసరావుపేట, పెన్ పవర్ సెప్టెంబర్ 18: నరసరావుపేట పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ– 2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమిష్ఠ కృషి — ప్రత్యేక మార్పు అనే నినాదంతో గుంటూరు రోడ్డులోని వరమీ కంపోస్ట్ యార్డు మరియు పట్టణంలోని మరో రెండు ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించడం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు అందించారు. మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన మాట్లాడుతూ పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన నరసరావుపేట లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమాదేవి, శానిటరీ పర్యావరణ కార్యదర్శులు, ఆంజనేయులు, లీలారాణి, కోటేశ్వరనాయక్, వీరాంజనేయులు మరియు మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించడంతో పాటు స్వచ్ఛ భారత్ – వికసిత భారత్ అంటు స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేటను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.





